అశ్వగంధ అంటే ఏమిటి?

ఆయుర్వేదవైద్యం లేదా ప్రత్యామ్నాయ వైద్యంలో మీకు గనుక సంపూర్ణమైన నమ్మకముంటే “అశ్వగంధ” మూలిక గురించి అనేకమార్లు వినే ఉంటారు. ఎందుకు విని ఉండరు? ఎందుకంటే అశ్వగంధ అత్యంత ముఖ్యమైన ఆయుర్వేద మూలికలలో ఒకటి. వేల సంవత్సరాల క్రితమే అశ్వగంధ యొక్క ఉనికి మరియు దాన్ని ఉపయోగించిన సంగతి గురించి అథర్వ(ణ)వేదంలో ఉంటంకించబడింది. భారతీయ సంప్రదాయిక వైద్యవిధానం తరచుగా అశ్వగంధను "మాయామూలిక" గా, ఒత్తిడిని హరించే  ఏజెంట్ గా (ఆంగ్లంలో “అడాప్టోజెన్” అంటారు.) సూచించింది. ఎందుకంటే ఇది ఒత్తిడి సంబంధిత లక్షణాలు మరియు ఆందోళనకర రుగ్మతలను తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగించే మూలికల్లో ఒకటి. “అశ్వగంధ” అనే పేరుకు అర్థం - ‘అశ్వ’ అంటే గుర్రం, మరియు ‘గంధ’ అంటే వాసన అని. అదనంగా చెప్పాలంటే అశ్వగంధ వేర్లు గుర్రం యొక్క మూత్రం లేక చెమట వాసనను కల్గి ఉంటాయి కాబట్టి నేరుగా తర్జుమా రూపంలో ఈ మూలికకు “అశ్వగంధ” అనే పేరు స్థిరపడింది. అలాగే ఆయుర్వేద పరిశోధకులు చెప్పే మరో మిషయమేమిటంటే అశ్వగంధను  సేవిస్తే గుర్రంకున్నంత లైంగిక శక్తి వస్తుందని.

అశ్వగంధ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

 • వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: విటానియా సోమ్నిఫెరా
 • కుటుంబము: సోలనాసియే (nightshade family)
 • సంస్కృతం పేర్లు: అశ్వగంధ, వరాహకార్ణి (ఆకులు పంది చెవిని పోలి ఉంటాయి), కామరూపిని.
 • సాధారణ పేర్లు: వింటర్ చెర్రీ, ఇండియన్ జిన్సెంగ్, పాయిజన్ గూస్బెర్రీ.
 • ఉపయోగించే భాగాలు: అశ్వగంధ వేర్లు మరియు ఆకులు ఎక్కువగా  మందుల్లో ఉపయోగిస్తారు. కానీ దీని పుష్పాలు మరియు విత్తనాలు కూడా ఉపయోగించబడుతున్నాయి.  ​
 • స్థానికంగా లభ్యమయ్యే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారతదేశంలోని వేడి ప్రదేశాలు, అందులోను ప్రముఖంగా మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు, నేపాల్, ఆఫ్రికా మరియు మధ్యతూర్పు (middle east) దేశాల్లో అశ్వగంధ ఉనికి, వాడకాలున్నాయి. ఇది అమెరికా (USA) లో కూడా ప్రవేశపెట్టబడింది.
 1. అశ్వగంధ ఎలా పనిచేస్తుంది - How does Ashwagandha work in Telugu
 2. అశ్వగంధ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు - Health Benefits and Uses of Ashwagandha in Telugu
 3. అశ్వగంధ మరియు అశ్వగంధచూర్ణాన్ని ఎలా ఉపయోగించాలి - How to use Ashwagandha and Ashwagandha Powder in Telugu
 4. అశ్వగంధ మోతాదు - Ashwagandha Dosage in Telugu
 5. అశ్వగంధ దుష్ప్రభావాలు - Side effects of Ashwagandha in Telugu
అశ్వగంధ సేవనం వల్ల ప్రయోజనాలు మరియు దుష్పలితాలు వైద్యులు

వైద్యంలో అశ్వగంధ అనేక "చర్యలు" కలుగజేస్తుంది. మూలికా శాస్త్రంలో చర్య లేదా చర్యలు అంటే అర్థమేమిటంటే ఒక మూలిక లేక మొక్కను చూర్ణాది రూపంలో సేవించినపుడు మానవ శరీరంలో ఎలాంటి చర్యను లేదా ప్రభావాన్ని కల్గిస్తుంది అని. మూలికల నిర్దిష్ట చర్యల్ని నిర్వచించడానికి పలు పదాలున్నాయి. శరీర సంక్షేమానికి ఒక మూలిక ఖచ్చితంగా ఎలా పని చేస్తుంది అనే విషయాన్ని మూలికాశాస్త్రం వివరిస్తుంది. అశ్వగంధ మూలిక యొక్క ప్రసిద్ధ ప్రయోజనాల జాబితా మీ కోసం :

 • అశ్వగంధ ఒత్తిడిని హరించే  ఏజెంట్ (ఆంగ్లంలో “అడాప్టోజెన్” అని అర్థం)గా ప్రసిద్ధి చెందింది గనుక ఈ మూలికను ఒత్తిడిని మరియు ఆందోళనకర రుగ్మతలను తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
 • అశ్వగంధ శరీరాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడుతుంది మరియు శారీరక-మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 • కొందరు ఇటీవలి పరిశోధకులు చెప్పిన ప్రకారం, అశ్వగంధకు కాన్సర్ కు విరుద్ధంగా పోరాడే గుణాలున్నాయి. క్యాన్సర్ చికిత్సలో ఈ మూలికా యొక్క ఉపయోగాన్ని గుర్తించేందుకు ఇంకనూ పరిశోధన  జరుగుతోంది.
 • భారతీయ శాస్త్రవేత్తలచే నిర్వహించబడిన ఒక పరిశోధన ప్రకారం అశ్వగంధ కీళ్ళ నొప్పులను తగ్గించడంలో చాలా ప్రభావకారి, ముఖ్యంగా కీళ్ళవాతంతో (rheumatoid arthritis) బాధపడుతున్న వారికి ఈ మూలిక చాలా బాగా పని చేస్తుందట.
 • లైంగిక పటుత్వం మరియు లైంగిక ఆరోగ్యం చేకూర్చడంలో అశ్వగంధసేవనం మేటిగా పని చేస్తుందని అధ్యయనాలు ఘోషిస్తున్నాయి.
 • అశ్వగంధసేవనం మూత్ర స్రావ ప్రేరకంగా పనిజేస్తుంది గనుక ఇది శరీరం నుండి అదనపు ద్రవాన్ని మరియు లవణాలను శరీరం నుండి వెలివేయడంలో బాగా పనిచేస్తుంది.
 • అశ్వగంధను సేవించడం మూలంగా చర్మం శుద్ధి అవుతుంది. మరియు వృద్ధాప్య ప్రారంభసంకేతాలను తప్పిస్తుంది.
 • ఒక అధ్యయనంలో ఏమి తేలిందంటే అశ్వగంధ పురుషులలో వీర్యకణాలు పెంచేందుకు తోడ్పడుతుందని కనుగొనబడింది.
 • ఆశ్వగంధకు శరీరంలో ఉష్ణాన్ని ప్రబలంగా పెంచే శక్తి ఉంది. ఆయుర్వేదంలో అశ్వగంధ పిత్తాన్ని పెంచుతుందని చెప్పబడింది.  

కాబట్టి పిత్తం అంటే ఏమిటి?

ఆయుర్వేదంలో త్రిదోషాలను లేక మూడు దోషాలను ఉటంకించడం జరిగింది. ఈ మూడు దోషాలు నియంత్రణలో ఉంటే మనిషి మంచి ఆరోగ్యంతో మనగల్గుతాడు. ఈ మూడు దోషాలు మనిషి శరీరంలో శక్తివంతమైన నియంత్రకాలుగా పనిజేస్తాయి. ఆ మూడు దోషాలు ఏవంటే:

 • వాతం- శరీరంలో జరిగే చలనక్రియతో కూడిన జీవక్రియ మరియు నరాల వ్యవస్థకు సంబంధించిన చర్యలు.  
 • పిత్తం-కఫమనేది శరీరంలో జీవించేందుకు జరిగే చయాపచయక్రియ అంటే జీవుల్లో జరిగే రసాయన ప్రక్రియలు. ద్రవం సంతులనంతో కూడిన చర్య.

కఫం- కఫమనేది శరీరం యొక్క ద్రవసంతులనంతో ముడిపడి జరిగే క్రియ.

మానసిక ఒత్తిడిని పోగొట్టే మందుగా అశ్వగంధ మూలిక పేరుమోసినా, దీనివల్ల ఇతర అనేక ప్రయోజనాలున్నాయి. ఆరోగ్య ప్రదాయినిగా అశ్వగంధ ఇంకా ఏయే ఆరోగ్య తొందర్లకు మరియు ఎన్ని విధాలుగా వాడబడుతున్నడా ఇపుడు విశ్లేషిద్దాం.

 • మానసిక-ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: అశ్వఘంధ అనేది ఒక బాగా తెలిసిన అడాప్టోజెన్ (adaptogen). ఇది ఒత్తిడి, నిరాశ మరియు ఆందోళనను   తగ్గించడానికి మరియు అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి ఒత్తిడి సంబంధిత సమస్యలను నిరోధించడానికి సహాయం చేస్తుందని కనుగొనబడింది.
 • ముధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది: పరిశోధన అధ్యయనాలు సూచించినట్లుగా అశ్వఘంధ ఒక అద్భుతమైన యాంటీ డయాబెటిక్ (anti-diabetic). ఇది ఇన్సులిన్ స్థాయిలు పెంచుతుంది మరియు ఆరోగ్యకరమైన వ్యక్తులలో మరియు మధుమేహం ఉన్నవ్యక్తులలో ఇద్దరిలోను రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.
 • ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది: దానికి సమర్థవంతమైన వాపు వ్యతిరేక చర్యలు ఉండడం వలన, అశ్వఘాంధ కీళ్ళ నొప్పిని మరియు వాపును  తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది పిత్త ను సమతుల్యం చేస్తుంది, ఇది ఆయుర్వేద వైద్యంలో ఆర్థరైటిస్కు  కారణంగా పరిగణింపబడుతుంది.
 • రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది: పరిశోధన ఫలితాలు  అశ్వగంధ ఒక  అద్భుతమైన ఇమ్యునోస్టీలేటర్ (immunostimulator) అని సూచిస్తున్నాయి. ఇది అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి  శరీరంలో రోగనిరోధక వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది.
 • గాయాలు నయం కావడాన్ని ప్రోత్సహాహిస్తుంది: ప్రీక్లినికల్ పరిశోధనలలో అశ్వగంధాను ఓరల్ (నోటి ద్వారా) గా ఇచ్చినప్పుడు అది గాయాన్ని  తగ్గించే ప్రక్రియను వేగవంతం చేసిందని సూచించబడింది. అయినప్పటికీ, ఈ ప్రయోజనాన్ని నిర్ధారించడానికి ఇంకా మానవ ఆధారిత అధ్యయనాలు అవసరం.
 • ఒక విశ్రాంతితో కూడిన నిద్రను అందిస్తుంది: ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం ద్వారా, అశ్వగంధ మీ మెదడును శాంతపరచి మంచి నిద్రను అందిస్తుంది.
 • లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: అశ్వఘంధ పురుషులు మరియు స్త్రీలలో లైంగిక కోరికను పెంచుతుంది. పురుషులలో మానసిక అంగస్తంభన  వైఫల్యాన్ని (psychogenic erectile dysfunction) తగ్గించడం మరియు  వీర్యకణాల సంఖ్యను మెరుగుపర్చడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
 • థైరాయిడ్ పనితీరును పెంచుతుంది: శరీరంలో T4 స్థాయిలను పెంచడానికి మరియు హైపో థైరాయిడిజంను తగ్గించడానికి  అశ్వఘంధా  సహాయం చేస్తుందని కనుగొనబడింది. అయితే, మానవులలో దాని ప్రయోజనాన్ని  నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమవుతాయి.
 • హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: అశ్వఘాంధ గుండె కండరాలను బలోపేతం చేయడం ద్వారా రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించడం మరియు గుండె మీద  ఒత్తిడిని తగ్గింస్తుంది తద్వారా గుండెకు సంపూర్ణ రక్షణను అందిస్తుంది. ఇది కూడా కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది,  కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకంగా ఉంటుంది.
 • మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది: పార్కిన్సన్స్ మరియు అల్జీమర్ల కారణంగా నరాలకు సంభవించే నష్టాన్ని అశ్వఘాంధ తగ్గిస్తుందని అధ్యయనాలు  సూచిస్తున్నాయి. అయితే, ఈ దాని విధానం (mechanism) ఇంకా తెలియలేదు.
 • అడ్రినల్ ఫెటీగ్ (అలసట)ను ఎదుర్కుంటుంది: అడాప్తోజెనిక్ (adaptogenic) మూలికగా , అశ్వగంధ మనస్సును ప్రశాంతపరుస్తుంది, తద్వారా  ఇది  శరీరంలో కర్టిసోల్ స్థాయిలను (ఒత్తిడి హార్మోన్) తగ్గిస్తుంది. ఇది మూత్రపిండాలపై  ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు అందువల్ల అడ్రినల్ ఫెటీగ్ తగ్గుతుంది.
 • పాము కాటుకు వ్యతిరేక విషం గా పని చెయ్యండి: అశ్వగంధ యొక్క సమయోచిత పూత పాము విషాన్నీన్యూట్రలైజ్(neutralises) చేస్తుంది మరియు శరీరంలో దాని వ్యాప్తిని నిరోధిస్తుంది అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 
 • చర్మ ప్రయోజనం కోసం: యాంటీఆక్సిడెంట్స్ యొక్క గొప్ప వనరుగా, అశ్వగంధ అనేది ఖచ్చితమైన యాంటి-ఏజింగ్ (వయసు పెరుగుదల మార్పులను తగ్గించే) మూలిక . ఇది వయస్సు పెరగడం వలన వచ్చే  మొట్టమొదటి సంకేతాలను తగ్గిస్తుంది మరియు పొడి చర్మం మరియు కెరాటోసిస్ను (keratosis) తగ్గిస్తుంది.
 • అద్భుతమైన జుట్టు టానిక్: అశ్వఘాంధ జుట్టుకు పోషణను అందిస్తుంది, ఇది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది మరియు జుట్టుకు మెరుపును అందిస్తుంది. ఒక యాంటీయాక్సిడెంట్గా, అది అకాలంగా వెంట్రుకలు నెరవడాన్ని మరియు జుట్టు నష్టాన్ని తగ్గిస్తుంది.
 • మెనోపాజ్ (రుతువిరతి) లక్షణాలను తగ్గిస్తుంది: అశ్వగంధ యొక్క టానిక్ మరియు ఒత్తిడి వ్యతిరేక లక్షణాలు మెనోపాజ్ వయసులో ఉన్న స్త్రీలకు మంచి మందు. ఇది ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది మరియు హార్మోన్ల సమతుల్యతను నిర్వహిస్తుంది తద్వారా మెనోపాజ్ లక్షణాలు నుండి ఉపశమనం అందిస్తుంది.
 • పురుషులు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది: పరిశోధన అధ్యయనాలు అశ్వగంధ యొక్క లక్షణాలను సంతానోత్పత్తి  సామర్ధ్యాన్ని పెంచే లక్షణాన్ని సూచిస్తున్నాయి. ఇది వీర్యకణాల సంఖ్యను మరియు టెస్టోస్టెరోన్ స్థాయిలను పెంచుతుంది, అంతేకాక  అది లైంగిక శక్తి మరియు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

 

మంచి విశ్రాంతనిద్ర కోసం అశ్వగంధ - Ashwagandha for a restful sleep in Telugu

అశ్వగంధ విపరీతమైన మత్తును కల్గించే తీక్షణమైన మత్తుమందు కాదని పరిశోధకులు చెబుతారు. అయితే ఇది ఒత్తిడిని, కలతను, ఆందోళనను, నొప్పిని, పోఁగొట్టే మూలికా ఔషధమని, దీంమో సేవిస్తే మంచి నిద్రను ప్రేరేపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

పురుషులకు అశ్వగంధతో లాభాలు - Ashwagandha benefits for men in Telugu

పురుషులలో సంతానోత్పత్తి శక్తిని పెంచడానికి ఉపయోగించే ప్రధాన మూలికల్లో అశ్వగంధ కూడా ఒకటి. అశ్వగంధను ప్రతినిత్యం సేవించడం వల్ల పురుషుల్లో లైంగిక ధారుఢ్యం పెరగడమే కాకుండా వీర్యకణాలను విరివిగా వృద్ధిచేస్తుందని, మరియు వృషణాల్లో “టెస్టోస్టెరోన్” అనే హార్మోన్ల స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పురుషుల యొక్క లైంగిక ఆరోగ్యాన్ని పెంచే విషయంలో అశ్వగంధలో ఉండే లాభదాయకమైన పునరుజ్జీవలక్షణాల ఎంతో ప్రభావకారిగా  పనిచేస్తాయి. అశ్వగంధ పురుషుల్లో అధిక బలాన్ని, మగతనాన్ని పెంచి వారి లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది.

మహిళలకు అశ్వగంధ ప్రయోజనాలు - Ashwagandha benefits for women in Telugu

అశ్వగంధ స్త్రీలలో ముట్లుడిగే (రుతువిరతి) సమయంలో కలిగే   ఒత్తిడి, చికాకు, ఆందోళన వంటి రుతుక్రమం ఆగిన లక్షణాలను తగ్గిస్తుందని, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అశ్వగంధ టానిక్ ను సేవించడం వల్ల మూత్రవిసర్జన రూపంలో మన శరీరంలో నిల్వ ఉండే విషతుల్య పదార్థాలను బయటకు పంపిస్తుంది. కనుక, విషతుల్య పదార్థాలు మన శరీరంలో ఎంతగా తగ్గితే మన ఆరోగ్యానికి అంత మంచిది. ఇంకా, అనేక ఆహార సంబంధిత లోపాలను తగ్గించడంలో అశ్వగంధ మీకు సహాయపడుతుంది. మహిళల్లో లైంగిక వాంఛను పెంచే గుణం అశ్వగంధలో పుష్కలంగా ఉందని కూడా పరిశోధనలు వెల్లడించాయి. రక్త ప్రసరణను పెంచి, శరీరంలో ఒత్తిడిని తగ్గించడం వలన మహిళల్లో లైంగిక వాంఛ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

కేశ (జుట్టు) ప్రయోజనాలకోసం అశ్వగంధ - Ashwagandha for hair in Telugu

అశ్వగంధ లో ఉండే యాంటీఆక్సిడెంట్ మరియు పోషకగుణాలు జుట్టుకు మంచి టానిక్ లాగా పని చేస్తుంది. అశ్వగంధ జుట్టుకుదుళ్లను పుష్టీకరించి జుట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. నిత్యం అశ్వగంధను సేవిస్తే శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది, తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అదనంగా, అశ్వగంధంలో ఉన్న అనామ్లజనకాలు లేదా ఆంటీఆక్సిడెంట్ గుణాలు  శరీరంలో స్వేచ్ఛారాశులు కల్గించే నష్టాన్ని ఎదుర్కొంటుంది మరియు జుట్టు తన సహజ రంగును కోల్పోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

చర్మసౌందర్యానికి, చర్మ రుగ్మతలకు అశ్వగంధ - Ashwagandha benefits for skin in Telugu

శుభ్రమైన, మృదువైన చర్మం కావాలని కోరుకోకుండా ఉండేదెవరు చెప్పండి? ఉండరు కదా. చిన్నవయసులోనే  ముసలివారికుండే విధంగా ముడతలు పడే చర్మం రావడాన్ని అశ్వగంధ నివారిస్తుందని మీకు తెలుసా? వృద్ధాప్యానికి అత్యంత సాధారణ కారణం మన శరీరం రోజువారీగా  నిర్వహించే వివిధ జీవక్రియ విధుల ఫలితంగా మన శరీరం లో ఏర్పడే స్వేచ్ఛారాశులు. ఈ స్వేచ్ఛారాశుల విరుద్ధంగా అశ్వగంధ పోరాడుతుంది, ఎందుకంటే అశ్వగంధలో అనామ్లజని లక్షణాలున్నాయి. అనామ్లజని అంటే ఆక్సీకరణాన్ని నిరోధించే ప్రదార్థం. అశ్వగంధ ఆక్సీకరణాన్ని నిరోధించేది గనుక శరీరం లో ఏర్పడే స్వేచ్ఛారాశుల విరుధ్ధంగా పోరాడి మీ చర్మాన్ని కాంతివంతంగా చేసి మిమ్మల్ని యవ్వనంగా ఉండేట్టు సహాయపడుతుంది. ఈ స్వేచ్ఛారాశుల కారణంగా మీ చర్మం ముడుతలుపడొచ్చు, ముదురు మచ్చలు ఏర్పడవచ్చు, అకాల వృద్ధాప్యం, ఇతరమైన వయసు మళ్ళిన సంకేతాలు దాపురించవచ్చు. వీటన్నింటినీ కూడా అశ్వగంధ తొలగించి మిమ్మల్ని సంతోషపరుస్తుంది. అదనంగా, “కెరటోసిస్” అనే చర్మంవ్యాధినివారిణిగా అశ్వగంధను ఉపయోగించొచ్చు. కెరటోసిస్ చర్మాన్ని పొడిగా మరియు కఠినమైనదిగా ఉండే చర్మవ్యాధి, అలాంటి వ్యాధిని అశ్వగంధ నివారిస్తుంది. అశ్వగంధను టీ చేసుకుని రోజూ సేవిస్తే కరోటోసిస్ రోగ లక్షణాలన్నీ తొలగిపోతాయి.

పాము కాటుకు అశ్వగంధ - Ashwagandha in snake bites in Telugu

అనేక అధ్యయనాల్లో తెలిసిందేమంటే, శరీరంలో పాము విషాన్ని (పాయిజన్) తొలగించే సహజ నిరోధకం (natural inhibitor)  అశ్వగంధ అని కనుగొనబడింది. మనకు కలిగే “హైలైరోనిడేస్” రోగవ్యాప్తిని నిలిపివేయగల “గ్లైకోప్రోటీన్” (ప్రోటీన్ రకం) గా అశ్వగంధ పని చేస్తుందని చెప్పబడింది.పాము విషంలోని “హ్యాలురోనిడేస్” అనే పదార్ధం శరీరంలోని ఇతర కండరాలకు వ్యాప్తి చెందకుండా అశ్వగంధ తనలోని గ్లైకోప్రోటీన్ లతో అడ్డుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అశ్వగంధ యొక్క చర్మలేపన మందు సంప్రదాయకంగా పాము కాటుకు విరుగుడుగా భారతదేశంలో ఉపయోగించబడుతోంది.

అడ్రినల్ గ్రంధి నిస్సత్తువకు (నిస్త్రాణకు) అశ్వగంధ - Ashwagandha for adrenal fatigue in Telugu

మీరు ఎప్పుడూ ఒత్తిడికి గురై అలసిపోతున్నట్లు భావిస్తున్నారా? ఇందుక్కారణం అడ్రినల్ గ్రంధి నిస్సత్తువ కావచ్చు. దాని గురించి ఎప్పుడూ వినలేదా? చాలామందికి ఇదేమిటో తెలియదు. వేగమైన జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలామందిలో ఈ అడ్రినల్ గ్రంధి నిస్సత్తువ అనేది  సాధారణంగా కనబడుతోంది. ఇది ఏదైనా కావచ్చు కానీ ఒత్తిడితో కూడుకుని ఉండే పరిస్థితి. ఇది పని ఒత్తిడి లేదా మరేదైనా ఒత్తిడి కావచ్చు. శరీరంలో నిరంతరమూ కలిగే ఈ ఒత్తిడి కారణంగా అడ్రినల్ గ్రంధి "ఒత్తిడి హార్మోన్" గా చెప్పబడే “కార్టిసాల్” అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. అడ్రినల్ గ్రంథులు మన శరీరంలో మూత్రపిండాలు పైన ఉన్న గ్రంథులు. ఇలా విడుదలైన కార్టిసాల్ హార్మోను నిస్సత్తువ, జీర్ణ సమస్యలు, నిద్రలేమి మరియు భయము వంటి సమస్యలకు దారితీస్తుంది. మీరు ఇప్పటికే తెలుసుకున్నట్లుగా అశ్వగంధి ఒత్తిడిని హరించే (యాంటీ-స్ట్రెస్ హెర్బ్) మూలిక కాబట్టి దీన్ని సేవిస్తే ఇది మిమ్మల్ని పైన చెప్పిన లక్షణాలనుండి (ఉపశమింపజేసి) శాంతింపజేయడానికి సహాయపడుతుంది. ఇంకా, శరీరంలో కార్టిసోల్ స్థాయిని తగ్గించి అడ్రినల్ గ్రంధి  నిస్సత్తువ విరుద్ధంగా పోరాడుతుంది.

నరాల వ్యాధులకు అశ్వగంధ - Ashwagandha for neurological diseases in Telugu

అశ్వగంధ ఎలా పని చేస్తుందో ఖచ్చితంగా చెప్పబడకపోయినా పార్కిన్సన్ వ్యాధి (అదురువాపు) మరియు ADHD (attention deficit hyperactivity disorder) అనే వ్యాధుల ప్రభావాలను తగ్గించడంలో సహాయకారిగా ఉంటుందని కనుగొనబడింది.

ఆరోగ్యవంతమైన గుండెకు అశ్వగంధ - Ashwagandha for a healthy heart in Telugu

శరీరంలో పెరిగే కొవ్వు (కొలెస్ట్రాల్) ను తగ్గించడంలో అశ్వగంధ తీక్షణంగా పని చేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ పెరుగుదలకు ఉపకరించేవే “ట్రైగ్లిజరైడ్స్” అనే మూడు కొవ్వుకారక ఆమ్లాలు. ఈ కొవ్వుకారక ఆమ్లాలు గుండె జబ్బులైనటువంటి గుండె పోటులు, స్ట్రోకులు మరియు నేటితరంలో వస్తున్న ధమనుల అడ్డంకి సమస్యకు కారణమవుతున్నాయి.   

అందువల్ల అశ్వగంధ యొక్క రోగనిరోధక (అడాప్తోజెనిక్) శక్తి, ఒత్తిడిని తగ్గించడంలో దానికున్న సామర్థ్యం శరీరంలో కలిగే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి కండరాలను సడిలపరుస్తుంది.  ఈ విధంగా శరీరానికి చాలా ఉపయోగకరంగా ఇది పని చేస్తుంది. కనుక గుండె కండరాలలో కలిగే ఒత్తిడిని కూడా తగ్గించే ఒక శక్తివంతమైన ఏజెంట్ గా అశ్వగంధ గుర్తింపబడింది. కొంతమంది పరిశోధకులు వాదించేదేమంటే  “అశ్వగంధ టానిక్” ప్రభావాలు గుండె కండరాలను బలపరుస్తాయని. భారతదేశంలో శ్రేష్ఠులైన సైకిల్ సవారీదారుల (సైక్లిస్టుల) బృందంపై జరిపిన ఓ శాస్త్రీయ పరిశోధన అశ్వగంధ సామర్థ్యాన్ని ప్రస్ఫుటంగా వివరించింది. మానవశరీరం ఏదైనా తీక్షణమైన, వేగవంతమైన భౌతికచర్యల (వ్యాయామాది చర్యలు) సమయంలో గుండెకు కావాల్సిన అధిక ప్రాణవాయువు (ఆక్సిజన్) ను అందించగలిగే “హృదయశ్వాస ఓరిమి”ని మెరుగుపరచడంలో అశ్వగంధ తన సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆ పరిశోధన కనుగొంది. శారీరక వ్యాయామం సమయంలో రక్తంలో మరింత ప్రాణవాయువును అందించడానికి మన హృదయం మరియు ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉండాలి, అందుకు హృదయశ్వాస ఓరిమి బహు ముఖ్యం. వ్యాయామాది చర్యల్లో మన శరీరం ఎక్కువ సమయం చురుకుగా ఉండటానికి  రక్తంలోని అధిక స్థాయి ఆక్సిజన్ మనకు సహాయపడుతుంది. ధమనుల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించే ప్రతిస్కంధక లక్షణాల (anticoagulant) ను అశ్వగంధ కలిగి ఉందంటే మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అందువల్ల,అశ్వగంధ మూలిక సాధారణమైన గుండె సమస్యలకు గుణకారిగా పనిచేస్తూ మన శరీరంలోని హృదయనాళ వ్యవస్థను కాపాడుతుంది.

(మరింత సమాచారం: గుండె జబ్బుల కారణాలు మరియు నివారణ

అశ్వగంధ థైరాయిడ్ గ్రంధుల పనితీరును పెంచుతుంది. - Ashwagandha increases thyroid functions in Telugu

శరీరంలో నిత్యం జరిగే జీర్ణక్రియ, జీవక్రియ చర్యలకు ఆవశ్యకమైన “T4 హార్మోన్” స్థాయిని అశ్వగంధి పెంచుతుందని తేలింది. శరీరంలో జరిగే జీవక్రియలకు అవసరమైన థైరాయిడ్ హార్మోన్లు గనుక తక్కువ ఉంటే ఆ పరిస్థితిని (hypothyroidism) “హైపోథైరాయిడిజం” వ్యాధిగా పరిగణిస్తారు. ఈ వ్యాధి చికిత్సలో ఈ అశ్వగంధ మూలిక యొక్క సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇంకా మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి.

లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అశ్వగంధ - Ashwagandha for improving sexual health in Telugu

పురుషులు మరియు మహిళల్లో లైంగికశక్తి, పరస్పరవాంఛను  మెరుగుపర్చడంలో అశ్వగంధ గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా, పురుషుల్లో మానసికజనితమైన అంగస్తంభన వైఫల్యాది సమస్యల (మానసిక కారణాల వలన పురుషుల్లో వచ్చే శీఘ్రస్కలనం  వంటి సమస్యలు) చికిత్సలో అశ్వగంధి మిగుల ప్రభావకారి అని చెప్పబడింది. ఇటీవలి అధ్యయనం ప్రకారం అశ్వగంధ యొక్క సాధారణ వినియోగం పురుషుల వీర్యకణాలను (స్పెర్మ్) పెంచుతుంది.

పుండ్లను మాన్పడానికి అశ్వగంధ సహాయకారి - Ashwagandha helps heal wounds in Telugu

ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధ మూలిక గాయాలను నయం చేసే ఓ సహజమైన అద్భుత ఔషధం. అశ్వగంధ యొక్క పేస్ట్ ను చర్మంపై గాయాలైన చోట పూసి గాయాలు, పుండ్లు నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక సంప్రదాయకంగా వస్తోన్న పధ్ధతి. మధుమేహం (చక్కెరవ్యాధి) తో బాధపడుతున్న ఎలుకలపైన అశ్వగంధ మూలిక ప్రభావాలను అధ్యయనం చేసేందుకు భారతదేశంలో విస్తృతమైన పరిశోధనలు  జరిగాయి. పరిశోధనలు తేల్చిందేమంటే అశ్వగంధ పండ్లను వేగంగా నయం చేస్తుందని. పైపూత కంటే అశ్వగంధను కడుపులోకి మందుగా సేవిస్తేనే వ్యాధులు, పుండ్లు వేగంగా నయమవుతాయని అధ్యయనకారులు సూచించారు. అశ్వగంధ యొక్క ప్రభావం ఎలుకలపైన జరిగిందే కానీ మనుషులపైన జరగలేదు, కాబట్టి అశ్వగంధను గాయాలను నయం చేసేందుకు వాడే ముందు మీ డాక్టర్తో మాట్లాడటం మంచిది.

శరీరంలో బలమైన రోగనిరోధక వ్యవస్థకు అశ్వగంధ - Ashwagandha for a strong immune system in Telugu

పెద్ద పెద్ద వృక్ష దారువుల్లో జనించే మైతాకే (maitake mushroom) జాతి  పుట్టగొడుగు సారం అనుపానంతో అశ్వగంధ ను సేవిస్తే మన శరీరంలో హాని చేసే కొన్ని విదేశీ సూక్ష్మజీవుల్ని సంహరించే భక్షకకణాల్ని పెంపొందిస్తుంది. మైతాకే పుట్టగొడుగును ఆసియాలో సాధారణంగా వంటల్లో వినియోగించే ఖాద్యవస్తువు. కాబట్టి ఈ అశ్వగంధ-మైతాకే పుట్టగొడుగు అనుపాన సేవనం వల్ల మన శరీరంలో  అంటువ్యాధులతో పోరాడడానికి కావలసిన శక్తి మెరుగుపడుతుంది. కాబట్టి, మీకెప్పుడైనా వాతావరణం కారణంగా జలుబు సంభవిస్తే అశ్వగంధ తేనీటిని (Ashwagandha tea) ఓ పనిమంతుడిలా తయారు చేసుకుని సేవించండి, చలిని, జలుబును పారదోలండి.

(మరింత సమాచారం: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాలు)  

కీళ్లనొప్పి నివారిణిగా అశ్వగంధ - Ashwagandha as an anti-arthritic in Telugu

మీరు వాపు మరియు బాధాకరమైన కీళ్లనొప్పి చేత బాధపడుతున్నారా? అధ్యయనాలు చెప్పేదేమంటే అశ్వగంధ వాపురోగాల్ని (శోథలు) నయం చేసే లక్షణాలను కలిగి ఉంది అని. కీళ్ళనొప్పుల లక్షణాలకు ఉపశమనం కలిగించడంలో అశ్వగంధ మూలిక ప్రత్యేకంగా తోడ్పడుతుంది. కీళ్ళనొప్పులు పొట్టలో ఉద్భవించే రోగమని, జీర్ణప్రక్రియలో వచ్చే అవకతవకలు, పిత్తం పరిమాణంలో హెచ్చుతక్కువలు కారణంగానే కీళ్ల తొందర్లొస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇలా పొట్టలో జనించే కీళ్లనొప్పుల్ని హరించేందుకు అశ్వగంధ ఎంతో ఉపయోగకారి. శరీరంలో పిత్తాన్ని పెంచి కఫాన్ని తగ్గించి కీళ్లనొప్పులు మాయమయ్యేందుకు అశ్వగంధ బాగా పని చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా, అశ్వగంధలోని వాపు-మంటనివారణా గుణాలు (యాంటీ-ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్) తామర వంటి చర్మ సమస్యలను నివారించటానికి సహాయపడుతుంద. సోరియాసిస్ మరియు చుండ్రు వంటి జుట్టు సమస్యలను అశ్వగంధ తుదముట్టిస్తుంది.

మధుమేహం (చక్కెరవ్యాధి) కోసం అశ్వగంధ - Ashwagandha for diabetes in Telugu

చక్కెరవ్యాధి (డయాబెటీస్) రోగులలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచేందుకు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు అశ్వగంధ మూలిక చాలా బాగా పని చేస్తుందని అధ్యయనాలు చూపుతున్నాయి. ఇది డయాబెటిక్ వ్యక్తుల్లో రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడంతో బాటు ఆరోగ్యవంతులైన వ్యక్తులలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఏమైనప్పటికి, మీ రోజువారీ ఆహార, ఔషధాల సేవనలో అశ్వగంధను కూడా చేర్చేదానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించండి. ఆ తర్వాతే అశ్వగంధను సేవించండి.

మానసిక ఆరోగ్యానికి అశ్వగంధ - Ashwagandha for mental health in Telugu

అశ్వగంధ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, కానీ దీన్ని ప్రధానంగా ఒత్తిడిని తగ్గించే చికిత్సకారిగానే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అశ్వగంధ యొక్క ఔషధ గుణాలు ఆందోళన-ఉపశమనకారిగా పనిచేయడం కారణంగా దీన్ని చైనీస్ జిన్సెంగ్ మరియు సైబీరియన్ జిన్సెంగ్తో పోలుస్తుంటారు. ఆశ్వగంధ ఆందోళనను మరియు దుఃఖం వంటి నిరాశ, ఒత్తిడి సంబంధిత మానసిక రుగ్మతల్ని గణనీయంగా తగ్గిస్తుందని ఒక శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైంది. అశ్వగంధ మూలికలో ఉన్న రోగనిరోధకశక్తి (adaptogenic) పోషకవిలువల కారణంగానే మానసికరోగ నివారిణిగా ఇది పనిచేస్తుంది. అశ్వగంధాకున్న రోగనిరోధక శక్తి వల్ల వయసు ముదరకనే ముసలితనం రావడం, అధిక రక్తపోటు (hypertension) మరియు మధుమేహం వంటి అనేక ఒత్తిడి-సంబంధిత వ్యాధులను నివారించడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది.

అశ్వగంధవేర్లమందు శాస్త్రీయంగా నిద్రలేమి (అంటే నిద్రపట్టని రోగం), కణితి, క్షయవ్యాధి, ఆస్త్మా, ల్యుకోడెర్మా, బ్రోన్కైటిస్, ఫైబ్రోమైయాల్జియా, అడ్రినల్ గ్రంధి నిస్సత్తువకు, ఇంకా ఇటువంటి అనేక ఆరోగ్య తొందర్లకు ఉపయోగించబడింది. అయినప్పటికీ, ఈ మూలిక శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఓ సాధారణ టానిక్ గానే ఎక్కువగా ఉపయోగించబడుతోంది. అశ్వగంధను ఆయుర్వేదశాస్త్రంలో  “రసాయన” అని కూడా పిలుస్తారు. కొందరు పరిశోధకుల ప్రకారం, మీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అశ్వగంధ అత్యుత్తమ మార్గంగా చెప్పవచ్చునంటున్నారు. ఎందుకంటే మీ తోటలో పెరిగే అశ్వగంధ మొక్క చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకవర్ధమైన టానిక్ గా పేరుగాంచింది.

ప్రస్తుతం అశ్వగంధను సాధారణంగా పొడిగా లేదా టీ రూపంలో ఉపయోగిస్తున్నారు. దీన్ని పాలు, నెయ్యి లేదా తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ రోజుల్లో అశ్వగంధ టింక్చర్ (ఈ మూలిక నుండి తయారైన మద్యం వంటిది) మరియు క్యాప్సుల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి, ఎందుకంటే అశ్వగంధను ఇలా టింక్చర్, క్యాప్సూల్స్ గా తీసుకోవడం సులభం మరియు ఇలా సేవించిన తర్వాత అది వేగంగా పని చేయడం జరుగుతుంది.

అశ్వగంధ సిరప్, టోపికెల్  క్రీమ్లు, మరియు పేస్టు రూపంలో కూడా మార్కెట్లో విరివిగా లభిస్తుంది.

ఇక్కడ అశ్వగంధ యొక్క సాధారణ మోతాదును మరియు ఉపయోగించే మార్గదర్శకాల్ని వివరిస్తున్నాం. అయితే, మీ ఆయుర్వేద డాక్టర్చే సూచించబడిన మోతాదును అనుసరించడమే చాలా మంచిందని మీకు గట్టిగా సిఫార్సు చేయడమైనది.  

 • సాధారణ మోతాదు 1-2 టీ స్పూన్ ల అశ్వగంధ చూర్ణాన్ని లేదా 1-2 క్యాప్సూల్స్ పాలు లేదా తేనెతో సేవించేది, ఇలా ఒక రోజుకి రెండుసార్లు సేవించవచ్చు.
 •  అశ్వగంధవేర్ల చూర్ణం, పాలు, తేనె, మరియు గింజలు మిశ్రమంతో టానిక్ను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ టానిక్కు మంచి నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది.
 • అశ్వగంధ ఆకులు పేస్ట్ గా తయారు చేసుకుని గాయాలు మరియు మంటతో కూడిన వాపుకు చికిత్సగా ఉపయోగిస్తారు.
 • తేనెతో అశ్వగంధను తీసుకున్నప్పుడు లైంగిక ఆరోగ్యానికి మంచిది అని చెప్పబడింది.
 • అశ్వగంధ సారంతో మద్యం మిళాయించి ఒక టించర్ తయారు చేయవచ్చు. ఈ టించర్ రక్తంతో సులభంగా మిళితమైపోతుంది, తద్వారా వేగంగా ఫలితాలు ఇస్తుంది. ఈ మూలికను ఇతర రకాలుగా కంటే టించర్గా ఉపయోగించడం వల్ల వేగవంతమైన  ఫలితాలుంటాయి. అశ్వగంధటించరు మోతాదు దాని (ఆ టించరు యొక్క) గాఢత, బలం మరియు వ్యక్తి (రోగి) వయస్సు మరియు లింగంపై ఆధారపడి ఉంటుంది. అశ్వగంధ యొక్క టింక్చర్ ను మీరు ఉంపయోగించేందుకు ముందుగా ఓ మూలికానిపుణుడ్ని (ఓషధిశాస్త్రవేత్త) సంప్రదించి సలహా తీసుకోండి.

ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్న అశ్వగంధ మూలిక ఎంతో ప్రసిద్ధి చెందింది, కానీ ఇది కొన్ని దుష్ప్రభావాల్ని(side effects) కూడా కల్గి ఉంది. మీరు ఈ మూలికను సేవించే ముందు మీ వైద్యుడిని సంప్రదించి  సలహా తీసుకొమ్మని మీకు సిఫార్సు చేయడమైంది.

 • అశ్వగంధ సహజంగా వేడిచేసే గుణాన్ని కల్గి  ఉండడం వల్ల వేడి (పిత్తం) శరీరం కలిగిన వ్యక్తులకు ఈ మూలిక పట్టకపోవచ్చు. ముఖ్యంగా,      దీర్ఘకాలికంగా ఇలాంటి వ్యక్తులు అశ్వగంధను సేవిస్తే గ్యాస్ట్రిక్ అల్సర్లు, అతిసారం, మరియు వాంతులకు కారణమవుతుంది.
 • మీ దినానిత్య ఆహారంలో అశ్వగంధను ఓ భాగం చేసుకునేందుకు ముందు వైద్య నిపుణుడిని సంప్రదించి సలహా తీసుకోండి. ఎందుకంటే మీరు  ఇప్పటికే వేరే మందులు సేవిస్తున్న యెడల, వాటితో బాటుగా అశ్వగంధను కూడా సేవిస్తే ఔషధం వికటించి మీకు చెడు ప్రభావాలను కల్గించే ప్రమాదం ఉండొచ్చు. ఉదాహరణకు, మీరు ఇప్పటికే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే  మందుల్ని తీసుకుంటున్నారు, ఆ మందులతో బాటు అశ్వగంధను కూడా తీసుకోవడం వలన మీ రక్తంలో చక్కెర స్థాయి మరింత తగ్గిపోయి “హైపోగ్లైసీమియా” అనే ప్రమాదకర జబ్బుకు దారి తీసే ప్రమాదముంది.
 • అశ్వగంధను గర్భధారణ సమయంలో సేవించడం  సురక్షితం కాదు, ఎందుకంటే అధిక మోతాదులో అశ్వగంధను గర్భవతులకిచ్చినపుడు గర్భస్రావాలకు దారి తీస్తుంది. దీన్నే అధిక మోతాదులో జంతువులకిచ్చినట్లైతే నెలలు నిండకనే అవి ఈనే అవకాశం ఉంది.
 • అశ్వగంధ రక్తాన్ని పలుచబరుస్తుంది, మరియు నరాల్లో రక్తం గడ్డకట్టి ఉంటే దాన్ని కరిగించే గుణాన్ని ఇది కల్గి ఉంది గనుక మీరు శస్త్రచికిత్స చేయించుకోవాలనే ప్రణాళికలో ఉన్నా, లేదా ఇటీవలనే శస్త్రచికిత్స చేయించుకొని ఉంటే అశ్వగంధ ను సేవించకండి. మీరిప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందుల్ని గనుక వాడుతూ ఉన్నట్లయితే, ఆ మందులతో బాటు అశ్వగంధను కూడా మీరు సేవిస్తే ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఆ మందులతో బాటు అశ్వగంధ మీ రక్తాన్ని మరింత పలుచబరుస్తుంది, అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు.
 • అశ్వగంధ తేలికపాటి మత్తును కల్గించే ఉపశమనకారిమందు గనుక దీన్ని సేవిస్తే ఇది మగతను (నిద్దురమత్తు లేదా మైకము)  కలిగించవచ్చు. కనుక మీరు ఇప్పటికే మరేవైనా నిద్రకల్గించే నిద్రమాత్రలవంటి మత్తుమందుల్ని సేవిస్తున్నట్లైతే వాటితోబాటుగా అశ్వగంధను కూడా సేవిస్తే అది అధిక నిద్రకు దారితీస్తుంది.
Dr Bhawna

Dr Bhawna

Ayurveda
5 Years of Experience

Dr. Padam Dixit

Dr. Padam Dixit

Ayurveda
10 Years of Experience

Dr Mir Suhail Bashir

Dr Mir Suhail Bashir

Ayurveda
2 Years of Experience

Dr. Saumya Gupta

Dr. Saumya Gupta

Ayurveda
1 Years of Experience


Medicines / Products that contain Ashwagandha

వనరులు

 1. Wadhwa R, Singh R, Gao R, et al.Water Extract of Ashwagandha Leaves Has Anticancer Activity: Identification of an Active Component and Its Mechanism of Action
 2. Jessica M. Gannon, Paige E. Forrest, K. N. Roy Chengappa. Subtle changes in thyroid indices during a placebo-controlled study of an extract of Withania somnifera in persons with bipolar disorder. J Ayurveda Integr Med. 2014 Oct-Dec; 5(4): 241–245. PMID: 25624699
 3. Kumar G, Srivastava A, Sharma SK, Rao TD, Gupta YK. Efficacy & safety evaluation of Ayurvedic treatment (Ashwagandha powder & Sidh Makardhwaj) in rheumatoid arthritis patients: a pilot prospective study.. Indian J Med Res. 2015 Jan;141(1):100-6. PMID: 25857501
 4. Vaclav Vetvicka, Jana Vetvickova. Immune enhancing effects of WB365, a novel combination of Ashwagandha (Withania somnifera) and Maitake (Grifola frondosa) extracts. N Am J Med Sci. 2011 Jul; 3(7): 320–324. PMID: 22540105
 5. Taranjeet Kaur and Gurcharan Kaur. Withania somnifera as a potential candidate to ameliorate high fat diet-induced anxiety and neuroinflammation. J Neuroinflammation. 2017; 14: 201. PMID: 29025435
 6. Chandrasekhar K1, Kapoor J, Anishetty S. A prospective, randomized double-blind, placebo-controlled study of safety and efficacy of a high-concentration full-spectrum extract of ashwagandha root in reducing stress and anxiety in adults.. Indian J Psychol Med. 2012 Jul;34(3):255-62. PMID: 23439798
 7. Narendra Singh, Mohit Bhalla, Prashanti de Jager, Marilena Gilca. An Overview on Ashwagandha: A Rasayana (Rejuvenator) of Ayurveda . Afr J Tradit Complement Altern Med. 2011; 8(5 Suppl): 208–213. PMID: 22754076
 8. Vijay R. Ambiye et al. Clinical Evaluation of the Spermatogenic Activity of the Root Extract of Ashwagandha (Withania somnifera) in Oligospermic Males: A Pilot Study . Evidence-Based Complementary and Alternative Medicine Volume 2013, Article ID 571420, 6 pages
 9. Mahesh K. Kaushik et al. Triethylene glycol, an active component of Ashwagandha (Withania somnifera) leaves, is responsible for sleep induction . PLoS One. 2017; 12(2): e0172508. PMID: 28207892
Read on app